తెలంగాణ రైతు భరోసా పథకం

తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన పథకం “రైతు భరోసా పథకం”. ఈ పథకo తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో “6 గ్యారంటీ” లలో ఒకటిగా ప్రతిపాదించ బడింది.

ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి ₹12,000 ఆర్థిక భరోసా అందించబడుతుంది. రైతులకు పంట పెట్టుబడికి సహాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

ప్రారంభ తేదీ

26 జనవరి 2025 న గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలను ప్రారంభించారు. వాటిలో రైతు భరోసా పథకం కూడా ఒకటి. 31 మార్చి 2025 లోపు రైతు భరోసా పథకం కింద దాదాపు ₹10,000 కోట్లను రైతులకు అందజేస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

ముఖ్య లక్ష్యం

రైతులకు ఆర్థిక సహాయం కల్పించటం ద్వారా వారికి అప్పుల భారం తగ్గుతుంది. ఈ ధనంని రైతులు పంట పెట్టుబడికి వినియోగించి మరింత ఎక్కువ దిగుబడులు పొంది, క్రమేణా ఆర్ధిక స్థిరత్వాన్ని పొందగలరు .

రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, గ్రామీణ అభివృద్ధి మరియు ఆహార భద్రతను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఎవరు అర్హులు

తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ప్రస్తుతం భూమి ఉన్న రైతులకు మాత్రమే అందించబడుతుంది. అయితే, ఆ భూమి వ్యవసాయ భూమి మాత్రమే అయి ఉండాలి. ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్ భూములకు ఈ పథకం కింద భరోసా లభించదు.

భూ భరతి (ధరణి) పోర్టల్‌లో నమోదు చేయబడిన “వ్యవసాయ యోగ్యమైన” భూమి ఆధారంగా రైతులకు ఈ రైతు భరోసా పథకం అందించబడుతుంది. వ్యవసాయ యోగ్యంకాని భూములకు రైతు భరోసా అందించబడదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా అందించబడుతుంది.

ఎంత మొత్తం లభిస్తుంది?

ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి ₹12,000 అందుతుంది.కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ₹6,000 ను మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹6,000 ను, మొత్తం కలిపి  ₹12,000 రైతులకు అందించబడుతుంది

 ఈ మొత్తం రెండు విడతలుగా అందించబడుతుంది:

✅ ₹6,000 – మొదటి విడత
✅ ₹6,000 – రెండో విడత

ఈ మొత్తాన్ని DBT (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది.

తాజా అప్‌డేట్స్

జనవరి 26, 2025 నుండి ఈ పథకం ప్రారంభమైన తర్వాత అదే రోజునుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం ప్రారంభించారు. పథకం అమలు మొదటి రోజునే 563 గ్రామాల్లో 6,15,677 మంది రైతులు లబ్ధి పొందారు. మార్చి 31, 2025 లోపు అర్హులైన అందరి రైతులకు మొదటి విడత ₹6,000 అందించనున్నారు.

ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత విషయాలపై సమాచారం పొందేందుకు మన దేశీఖేతి తెలుగు వాట్సాప్ ఛానల్‌ను జాయిన్ అవండి.

లింక్ – దేశీఖేతి తెలుగు వాట్సాప్ ఛానల్‌

Leave a Comment