ఉల్లి రైతులకు శుభవార్త: 1 ఏప్రిల్ 2025 నుండి 0% ఎగుమతి సుంకం

ఉల్లి రైతులకు శుభవార్త

భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2025 నుండి ఉల్లి ఎగుమతిపై 20% ఎగుమతి సుంకాన్ని తొలగించనున్నది. దీంతో రైతులు ఉల్లిని అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి అదనపు సుంకం లేకుండా విక్రయించగలుగుతారు.

నేపథ్యం

గతంలో ఉల్లి ధరలు అధికంగా పెరిగిపోవడంతో, భారత ప్రభుత్వం దేశంలో తగినంత ఉల్లి సరఫరా ఉండేందుకు మరియు ఉల్లి ధరలు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేందుకు పలు చర్యలు తీసుకుంది. 13 సెప్టెంబరు 2024 న ఉల్లి పై 20% ఎగుమతి పన్ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు ఉల్లికి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ) ను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని మరింత నియంత్రించడానికి, ప్రభుత్వం 8 డిసెంబర్ 2023 నుండి 3 మే 2024 వరకు పూర్తి ఎగుమతి నిషేధాన్ని విధించింది.

ప్రస్తుత పరిస్థితి

ఇప్పుడు, పరిస్థితి మెరుగుపడింది. రబీ ఉల్లి ఉత్పత్తి 227 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ అంచనా. ఇది గత సంవత్సరం కంటే 18% ఎక్కువ. ఈ అధిక ఉత్పత్తి వల్ల రాబోయే నెలల్లో ఉల్లి ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

అలాగే, గత నెలలో ఉల్లి రిటైల్ ధర 10% వరకు తగ్గినట్లు అంచనా. అదనంగా, మహారాష్ట్రలోని ముఖ్యమైన ఉల్లి మార్కెట్లైన లాసల్‌గావ్‌, పింపాల్‌గావ్‌ లలో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఎగుమతి పన్ను తొలగింపు నిర్ణయం

ఉల్లి ధరలు క్రమక్రమంగా స్థిరపడుతున్నాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరియు రైతులకు ప్రయోజనం కల్పించేందుకు, ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై 20% పన్నును తొలగించాలని నిర్ణయించింది.

ఇది రైతులకు ఒక మంచి అవకాశం. గతంలో ఎగుమతి పన్ను ఉన్నప్పటికీ, ఉల్లి ఎగుమతులు బలంగా కొనసాగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.17 లక్షల మెట్రిక్ టన్నులు మరియు 2024-25లో 11.65 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులు జరిగాయి.

ప్రపంచ మార్కెట్‌లో భారతీయ ఉల్లికి ఉన్న డిమాండ్‌కు ఇది ఒక నిదర్శనం. ఉల్లి పై ఎగుమతి సుంకం ని తొలగించడం వల్ల ఎగుమతులు మరింత పెరిగి, రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంది.

“1 April 2025 నుండి ఉల్లి ఎగుమతి పై సుంఖం ఉండదు! మోదీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకు లాభదాయకమైన ధరలను అందించడమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత. ఎగుమతి సుంకం తగ్గించడం ద్వారా మన రైతులు కష్టపడి ఉత్పత్తి చేసిన ఉల్లిపాయలను, ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేసి లాభదాయకమైన ధరలను పొందవచ్చు.” అని గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పుకొచ్చారు.

Leave a Comment